హైదరాబాద్, వెలుగు: మహిళా కండక్టర్‌పై ప్రయాణికురాలు దాడికి పాల్పడటం అత్యంత అమానుషమని టీజీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) రాష్ట్ర కమిటీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద ఆధార్ కార్డు లేకుండా బస్సు ఎక్కిన ఒక మహిళా ప్రయాణికురాలిని టికెట్ డబ్బులు అడిగినందుకు వివాదం చెలరేగింది. ఈ క్రమంలో సదరు ప్రయాణికురాలు కండక్టర్ ప్రవళికను కిందకు నెట్టివేయడంతో, ఆమె బస్సు టైర్ల కింద పడి తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఈయూ నేతలు ఎస్. బాబు, ఈదురు వెంకన్న, టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి, ఎన్ఎంయూ నేతలు పి. కమాల్ రెడ్డి, ఎండీ మౌలానా, ఎం. నరేందర్‌లు వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బాధితురాలు ప్రవళికకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు తక్షణమే రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఉద్యోగ, ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సిబ్బంది భద్రత కోసం ప్రత్యేక అత్యవసర టోల్ ఫ్రీ నంబర్‌ను కేటాయించాలని ఆర్టీసీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.
కండక్టర్‌పై దాడిని ఖండించిన మంత్రి పొన్నం
మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక విధుల్లో ఉన్న సమయంలో ఆమెపై జరిగిన దాడిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మంత్రి మాట్లాడి తెలుసుకున్నారు. ప్రవళికకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని, ఆమెపై దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
